తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా తెలంగాణలో కొన్నిచోట్ల ఏకధాటిగా వాన పడుతూనే ఉంది. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది వాతావరణశాఖ.
హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రాత్రి కురిసిన వర్షానికి ఆర్ సీపురం, హఫీజ్ పేట, సీతాఫల్ మండి, మాదాపూర్, కేపీహెచ్బీ, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, ఏఎస్ రావు నగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
ఆది, సోమ వారాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది వాతావరణశాఖ. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ చేయడం ఇదే మొదటిసారి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.