తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడొచ్చని అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
ఈ 3 రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని పేర్కొంది. ఆ ప్రభావంతో రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని.. దాంతో మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది.
ముఖ్యంగా రెండురోజులపాటు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండుల్లా మారాయి. అయితే.. గోదావరి ఉద్ధృతి కాస్త తగ్గింది. భద్రాచలంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు అధికారులు.
ఇటు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ ఫుల్ అయింది. కూకట్‌పల్లి నాలా నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది. వరద నీటిని తూముల ద్వారా బయటికి విడుదల చేశారు.
మరోవైపు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 250, ఔట్ ఫ్లో 312 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1786 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. అలాగే.. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 500, ఔట్ ఫ్లో 515 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1760 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు.