రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాలూ అతలాకుతలమవుతున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 వరకూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో బుధవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. ఈ కాలనీల్లో ని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. సహాయక చర్యల్లో పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. వరద బాధిత ప్రజలకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాల్తూరు, ఉండ బండ, ఆర్.కొట్టాల, డేనేకల్ వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
అనంతపురంలోని అర్థరాత్రి భద్రంపల్లి వద్ద వాగు ఉధృతి పెరిగింది. వరదలో కారులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడారు బుక్కరాయసముద్రం పోలీసులు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైఎస్సార్ కడప జిల్లాలో పెన్నా నది ఉగ్ర రూపం దాల్చింది. పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కి భారీగా వరద నీరు చేరుతుండటంతో.. సమీప గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.61 టీఎంసీలుగా ఉంది. దీంతో దిగువకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. అలాగే తుంగభద్ర జలాశయం వదర నీరు కొనసాగుతుంది. దీంతో 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఇటు తెలంగాణ వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు రోజుల పాటు అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
బుధవారం రాత్రి హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున వర్షం నీరు రోడ్లపై నిలిచింది. ఆటోలు, కార్లు, పలు వాహనాలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. బోరబండ, సంతోష్ నగర్, ఖైరతాబాద్, మణికొండ, జూబ్లి హిల్స్, బంజారా హిల్స్, అమీర్ పేట్, రామాంతాపూర్, ఎల్బీనగర్, చాదర్ ఘాట్, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలో రోడ్లపైనే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి అవస్థలు పడ్డారు.