ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచనలు చేసారు.