ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. గోపాలపురలో కొండచరియలు విరిగిపడి గురువారం ఇద్దరు మైనర్లు మృత్యువాత పడ్డారు. గువహటిలో కురుస్తున్న వర్షాలకు నగరమంతా వరద నీటితో నిండిపోయింది.
మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో వరద ఉధ్ధృతి వల్ల కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. మేఘాలయలోని లుమ్న్షాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 6 బాగా ధ్వంసమైంది. ఒక లారీ, ఒక కారు గుంతలో కూరుకుపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రంగంలోకి దిగిన విపత్తు నిర్వాహణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్ హెచ్ 6 పై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో మరో దారి వైపు వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఈ విషయం గురించి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా పలు రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.
పలు ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు సీఎం. ట్రాఫిక్ ను సరిచేసి నిలిచిన వాహనాలను వెళ్లేటట్లు చర్యలు చేపట్టారు. లారీ ఒకటి రోడ్డు మధ్యలో కూరుకుపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.