హైదరాబాద్ నగరాన్ని వరుణదేవుడు ముంచెత్తాడు. నగరంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రహదారులపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
ప్రధానంగా షేక్‌పేట్, గచ్చిబౌళి, నీజాంపేట్, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. అలాగే ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నక, అంబర్‌పేట్ తదిదరప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్ని చెరువులను తలపించాయి.
అత్యధికంగా షేక్‌పేట్‌లో 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మాదాపూర్‌లో 109, జూబ్లీ హిల్స్‌లో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారు.
జీహెచ్ఏంసీ అధికారులు రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉపరితల ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లద్దని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.