భారీ వర్షాలకు కేరళ అల్లాడిపోతోంది. ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఎర్నాకుళం, ఇడుక్కి, పథనంథిట్ట, కొట్టాయం, త్రిశూర్ జల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో నానుతున్నాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు తిరువనంతపురం, మలప్పురం, కోజికోడ్, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు అధికారులు.
కొట్టాయంలో ఓ కారు కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి తాడు సాయంతో పట్టుకున్నారు. అలాగే పూంజార్ ఏరియాలో ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోయింది. ప్రయాణికులను స్థానికులు కాపాడారు. మరో రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.