రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ సహా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో.. గోదావరికి వరద పోటెత్తింది. ప్రాణహిత కూడా ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 49 అడుగులకు చేరింది. ఈ క్రమంలోనే రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. 11,39,230 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. అలాగే.. సింగూర్ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. కాళేశ్వరం దగ్గర గోదావరి 12.9 మీటర్ల ఎత్తుకు చేరుకుని ప్రమాదకరంగా మారింది.
రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెండురోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.. గత పదేళ్లలో జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని వివరించింది.
ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. 16,100 మీటర్లకు చేరింది నీటి మట్టం. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగోలు గ్రామం వద్ద రహదారిపై వరద నీరు చేరడంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు.
ఇల్లందు, కోయగూడెం ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో నీరు చేరింది. రోజుకు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.