టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యానికి రైతులు బలవుతూనే ఉన్నారు. వానాకాలం ధాన్యం కొనకుండా.. యాసంగి పంట కోసం యుద్ధం చేస్తూ.. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. దీనికితోడు వరుణుడు సైతం కనికరించడం లేదు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో భారీ వర్షం పడింది. ఆల్రెడీ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులకు మరోసారి అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.
కోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా.. కొనుగోళ్లలో ఆలస్యంగా జరుగుతుండడం రైతులకు శాపంగా మారింది. మొన్నటి వర్షాలకు ధాన్యం రాశులు తడిసిపోయాయి. దీంతో పంటను ఆరబెట్టగా.. తాజాగా పడిన వర్షం కారణంగా మళ్లీ తడిసిపోయింది. పంట సాగు కంటే అమ్మేందుకు పడే కష్టం పదింతలు అవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆరు నెలల కష్టం నీటి పాలవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు.
నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూపులతో ఆరోగ్యం పాడవుతోందని చెబుతున్నారు రైతులు. ఇప్పటికే పలువురు ధాన్యం రాశులపైనే కుప్పకూలారు. ప్రభుత్వం ఇంకా చోద్యం చూడడం కరెక్ట్ కాదని.. వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.