రాయలసీమను వరదలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి అతలాకుతలం అయింది. వరద కారణంగా చాలా వాహనాలు రోడ్లపై ఇరుక్కుపోవడంతో బాలపల్లి, కుక్కలదొడ్డి మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. కార్లు సైతం మునిగిపోయేంత వరద నీరు రోడ్లపైకి చేరడంతో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
అలిపిరి నుంచి తిరుమలకు ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో కొండచరియలను తొలగిస్తున్నారు. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ-కేసీపేట మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జి కూలిపోయింది. వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఓ లారీ నీటిలో కొట్టుకుపోయింది. గార్గేయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. అలాగే స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. తిరుచానూరు వసంతనగర్ లో ఓ ఇల్లు వరదనీటిలో కొట్టుకుపోయింది.
అనంతపురం జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. కదిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న కోనేరు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది.
కడపజిల్లా రాజంపేట పరిధిలోని చెయ్యేరు డ్యాం కొట్టుకుపోయింది. పదుల సంఖ్యలో గ్రామాలు నీటిమునిగాయి. దీంతో ప్రజలు కొండపైకి ఎక్కారు. నందలూరు మండలంలోని గుండ్లూరు, కొలత్తూరుతో పాటు పలు గ్రామాలు నీటిమునిగాయి. ఫించా డ్యాం నుండి ఉద్ధృతంగా నీరు కిందకు రావడంతో చెయ్యేరు డ్యాం కొట్టుకుపోయింది. నందలూరు ఆనంద టెంపుల్ కూడా నీటమునిగింది.
ఇటు నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సోమశిల జలాశయానికి 3.9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 11 గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు.