రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలకు బుధవారం వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే.. వర్షాలు ఇంకా తగ్గక పోవడం, పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించక పోవడంతో మరికొన్నిరోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలో 13 వరకు విద్యాలయాలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా వర్షాల వల్ల రాష్ట్రం పరిస్థితి అల్లకల్లోలంగా మారడంతో మరో మూడు రోజులు అంటే శనివారం వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలోనే ఎంసెట్ పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే తెలుపుతామని పేర్కొంది. అసలు ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలు గురు,శుక్రవారాలు జరగాల్సి ఉంది.
ప్రస్తుతానికి అయితే జులై 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ప్రకారం అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరగడం కూడా సందేహమే.