తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల కారణంగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావారణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. అల్పపీడనం కారణంగా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు అధికారులు.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంటోంది వాతావరణశాఖ. మంగళవారం కూడా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రెండుచోట్ల భారీగా, 29 ప్రాంతాల్లో మోస్తరుగా, 193 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ఈసారి తెలంగాణలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. మామూలుగా నైరుతి సీజన్ లో 61.58 సెంటీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉండేది. కానీ.. ఆదివారం నాటికి రాష్ట్రంలో 78.86 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.