తెలుగు రాష్టాల్లో ఎండలు షురూ అయ్యాయి. క్రమ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది. ఈ నెల 16 నుంచి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగులు, ఉరుములు, భారీ ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమ గాలుల వల్ల ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఎత్తైన ప్రదేశం నుండి 7.6 కి.మీ, ఇది బీహార్ నుండి దక్షిణ కర్ణాటక వరకు చత్తీస్ గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఈ నెల 16న తూర్పు భారతం మీదుగా మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడే వాయుగుండం బలపడనుంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఏపీలో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా చోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది వాతావరణ శాఖ.