బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కుంభవృష్టి వాన పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. అంబర్ పేటలో భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఓయూ పరిధిలోని మోహినీ చెరువు నుంచి వస్తున్న వరద తాకిడికి అంబర్ పేట, పటేల్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
లక్డీకపూల్, హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, నాంపల్లి, కోఠి, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం, గోల్నాక, ఖైరతాబాద్, పంజాగుట్ట, రాజేంద్రనగర్ లో భారీ వర్షం కురిసింది. ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో 95 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో 78.5, హైదరాబాద్ అంబర్ పేటలో 77.8, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 69.5, మంచాల మండలం ఆరుట్లలో 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇటు ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణను ముసురు కమ్మేయడం.. భారీ వర్షాలు పడుతుండడంతో జనం భయాందోళనలో ఉన్నారు. ఈమధ్య కురిసిన వర్షాలు.. వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. మళ్లీ వరదలు వస్తే ఏం చేయాలోనని భయపడిపోతున్నారు.