భారీ వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేస్తున్నాయి.రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.భారీ వరద ప్రవాహానికి వరదరాజ నగర్ లో వాహనాలు కొట్టుకుపోయాయి.అటు..అలిపిరి నడకమార్గం,ఘాటు రోడ్లు మూసివేశారు.కొండచరియలు విరిగిపడుతుండటం..రాళ్లు,మట్టి రోడ్డుపైకి కొట్టుకురావటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీరు పోటెత్తుతోంది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపించింది. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రెండు ఘాట్ రోడ్లను మూసివేసింది టీటీడీ. రెండు నడకమార్గాలు కూడా 19వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది. వైకుంఠం క్యూలైన్‌లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి.
హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలిపోయింది. కొండపై నుంచి రోడ్డుపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శేషాచలకొండల నుంచి తిరుపతి నగరంలోకి వరద భారీగా వస్తోంది. తుమ్మలగుంట చెరువు కట్ట తెగిపోయింది. కల్యాణి డ్యామ్ నిండిపోవడంతో అధికారులు నీటిని దిగువకు వదిలారు. పలుచోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో తిరుపతిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు చిత్తూరు మురకంబట్టు దగ్గర స్కూల్ వ్యాన్ వరదనీటిలో నిలిచిపోయింది. దీంతో స్థానికులు అందులో ఉన్న 40 మంది విద్యార్థులను కాపాడారు.