భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఆదివారం సాయంత్రం మొదలైన వాన రాత్రంతా పడుతూనే ఉంది. ఉదయానికి లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు చేరాయి.
ముఖ్యంగా విజయనగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సీఎస్ థియేటర్ లోకి వర్షం నీరు ప్రవేశించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా నీరు రావడంతో సీట్లు పైకి ఎక్కి చూశారు.
కొత్తవలస, మెంటాడ తదితర మండలాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కూనేటిగెడ్డ, రాజులగెడ్డ పొంగిపొర్లాయి. చంపావతి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది.