తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. కాగా మహబూబ్ నగర్ లో వర్షం కుంభవృష్టిగా పడింది.
మహబూబ్ నగర్ పట్టణాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వీధులన్నీ ఏరులై ప్రవహించాయి. లోతట్టు కాలనీల లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో.. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నానా ఇబ్బందులు పడ్డ కాలనీ వాసులు మరోసారి కురిసిన వర్షంతో అవస్థలు పడుతున్నారు.
లోతట్టు కాలనీలు అయిన రమయ్యబౌలి, బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్, పాత ఆర్టీవో ఆఫీస్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు రావడంతో వాహనాలు నీట మునిగాయి. కాలనీల్లోకి నడుం లోతు నీరు రావడంతో చంటి పిల్లలతో ఇబ్బందులు పడుతూ బిక్కు బిక్కుమంటూ ఇతరుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు ప్రజలు. రాత్రుళ్లు కరెంట్ లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు.
అయితే మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 వరకూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ పేర్కొంది.