అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల లోలెవల్ బ్రిడ్జీల పైనుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
భారీ వర్షాలకు హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ చెరువు ఉప్పొంగింది. జాతీయ రహదారిపైనుంచి ప్రవహిస్తోంది. వరంగల్, ములుగుకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఇక ఐనవోలు మండలం పంథిని గ్రామ శివారులో వర్షాలకు బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి ఓ లారీ పక్కకు ఒరిగిపోయింది.
జమ్మికుంటలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లు, షాపులు అనే తేడా లేకుండా అన్నీ నీళ్లల్లో నానుతున్నాయి.