గులాబ్ తుపాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల్లో దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గంటకోసారి ఏదో చోట కుండపోతపడుతూనే ఉంది. తుపాను తీవ్రత వాయుగుండగా బలహీనపడినప్పటికీ.. వర్షాల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే వర్షాలు కురిసి ఉండటంతో.. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరి, మానేరు నదుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పార్వతీ బ్యారేజ్‌కు వరద నీరు పెరిగింది. దీంతో అధికారులు 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కడియాల బుడ్డివాగు పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా మొండికుంట- భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మక్తల్‌లోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. గేట్లు తెరచి నీటిని దిగువ జూరాల ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని బట్టి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లో శనివారం రాత్రి నుంచి.. విడతలవారీగా కుండపోత కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నగరం ఇప్పటికే తడిసి ముద్దయి ఉండటంతో.. ఐదు నిమిషాల వానకే అనేక ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్ల వెంట వరద నీరు చెరువులని తలపిస్తోంది. వరద కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురై చాలా చోట్ల.. రోజంతా ట్రాఫిక్ స్తంభించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో భారీగా వరదనీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తుండటంతో నగరవాసులు బెంబెలెత్తిపోతున్నారు.
భారీ వర్షాల దృష్ట్యా నగరంలో శాఖల వారీగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వరద నీటిలో తిరగొద్దని, అలాగే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు. సాధారణ సమస్యలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్ 040-23202813కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలపై కంట్రోల్ రూమ్ నంబరు 18004250028, టోల్‌ఫ్రీ నంబరు 1912కు కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. అటు పోలీసులు కూడా ఎలాంటి సమస్య ఉన్నా డయల్ 100కి ఫోన్ చేయొచ్చని తెలిపారు.
వాయుగుండంగా బలహీనపడిన తుపాన్.. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ సరిహద్దుల్లో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 24గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణకు సంబంధించి పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్,నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
గులాబ్ తుఫాన్ దృష్టిలో పెట్టుకుని జేఎన్టీయూహెచ్ పరిధిలో సోమవారం జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఇక మహత్మాగాంధీ యూనివర్సిటీ,OUలో 28,29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
గులాబ్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేయాలని సూచించారు