హైదరాబాద్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి..కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మాత్రం నగరంలోని జనమంతా ఇక్కడే ఉన్నారా? అన్నట్టుగా ఉంది. స్టేషన్ పరిసరాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి ఊర్లకు వెళ్లే ప్రయాణీకులతో క్రిక్కిరిసి పోతోంది. ఏపీకి వెళ్లే బస్సుల్లో రెండింతల చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణీకులంతా రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, తిరుపతి, కడప, కర్నూలు కు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదు.
రైళ్లలోకి ఎక్కేందుకు ప్రయాణీకులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్తున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు రైళ్లలోకి ఎక్కడం కష్టతరమైంది. వారిని కంట్రోల్ చేయడం అక్కడున్న పోలీసులకు సాధ్యపడడం లేదు . ఎక్స్ ప్రెస్ రైళ్లలో స్లీపర్, రిజర్వ్ డ్ బోగీలు జనరల్ బోగీలను తలపిస్తున్నాయి. ప్రతి రోజు లక్షా 80 వేల మంది ప్రయాణీస్తుండగా పండుగ సీజన్ లో రోజు రెండు లక్షల 20 వేల మంది ప్రయాణీస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. జనరల్ బోగీల్లో సీట్లు లేవని తెలిసినా రైల్వే సిబ్బంది చివరి క్షణం వరకు టిక్కెట్లు ఇస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కో రైలులో 1500-1600 మంది ప్రయాణీకులకు బదులు రెట్టింపు ప్రయాణీకులు ఎక్కుతున్నారు. జనరల్ బోగీల్లోని వారంతా రిజర్వ్‌డ్ బోగీల్లోకి వెళ్తున్నారు. అలా వెళ్లే వారిని రైల్వే సిబ్బంది నిలువరించలేకపోతున్నారు.
Advertisements