చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే ఫుడ్, పానీయాలతో ఎప్పటికైనా ప్రమాదకరం. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాఫీ, టీ ఇతర తియ్యని ద్రవాల్లో చక్కెర తక్కువగా ఉండటమే బెటర్. ప్రతీరోజూ తగిన పరిమాణంలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. లేకపోతే ఊబకాయం, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ అధ్యయనం చేశారు పరిశోధకులు.
ప్యాక్ చేసే ఆహారాల నుండి చక్కెరను 20 శాతం, పానీయాల నుండి 40 శాతం వరకు తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ విధానం వల్ల 2.48 మిలియన్ల మందిని గుండె సంబంధిత వ్యాధులనుంచి బయటపడేయొచ్చని చెబుతున్నారు. పైగా వైద్య ఖర్చులు కూడా భారీగా తగ్గిపోతాయని సూచిస్తున్నారు.
జర్నల్ సర్క్యులేషన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం యూఎస్ లో 7.5 లక్షల డయాబెటిస్ కేసులను నిరోధించవచ్చట. చక్కెర వాడకంలో ప్రతిపాదిత తగ్గింపు అమలు చేస్తే కనీసం 4.9లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఈ చక్కెర సంస్కరణ విధానాన్ని అమలు చేస్తారనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ అధ్యయనం సహాయ పడుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
చక్కెరపై పన్ను విధించడం, కంటెంట్ ని లేబుల్ చేయడం, స్కూళ్లలో డ్రింక్స్ ను నిషేధించడం వంటి కార్యక్రమాల కంటే వాణిజ్యపరంగా తయారు చేసిన ఆహారాలు, డ్రింక్స్ లో చక్కెర కంటెంట్ ని తగ్గించడం వల్ల అమెరికన్ల ఆరోగ్యాన్ని కాపాడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చక్కెర నిండిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు.