కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర మంగళవారం యూపీ.. ఘజియాబాద్ లోని ‘లోనీ’ బోర్డర్లో ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా ఈ బోర్డర్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రోడ్లన్నీ జన సందోహంతో క్రిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కోసమని ప్రత్యేకంగా ఆయా రూట్లను ఫిక్స్ చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు నానా పాట్లు పడ్డారు.
ఈ యాత్ర సాగుతున్న రూట్లలో కాకుండా ఇతర రూట్లలో ప్రయాణించాలని, అనేక చోట్ల రూట్లను డైవర్ట్ చేశామని ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలను జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని వారు పేర్కొన్నారు. ‘లోనీ’ ఎంట్రీని పూర్తిగా మూసి వేశారు. అయితే ఇప్పటికే రాహుల్ సెక్యూరిటీపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
తన పాదయాత్రలో పాల్గొనాలని రాహుల్ అన్ని పార్టీల నేతలను కోరడం కూడా ఒక విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడానికి కారణమవుతోందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాహుల్ కి సెక్యూరిటీ దాదాపు సమస్యగా మారిందని అంటున్నారు. తనకు సమీపంగా వస్తున్నవారిని ఆయన నివారించలేకపోతున్నారని, కేవలం ఆయనను చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఘజియాబాద్ నుంచి రాహుల్ యాత్ర మొదలై బుధవారం యూపీ చేరుకోనుంది. ఈ నెల 5 వరకు ఈ రాష్ట్రంలో యాత్ర సాగుతుంది. 6 న హర్యానాలో, 11 న పంజాబ్ లో ప్రవేశిస్తుంది.
తమరాష్ట్రంలో రాహుల్ యాత్రకు పూర్తి భద్రత కల్పిస్తామని హర్యానా హోమ్ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో యాత్ర మొదటిదశలో.. డిసెంబరు 21-23 తేదీల్లో కేవలం కొన్ని సెగ్మెంట్లలో సాగింది. మొదటి దశలో 9 రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను నిర్వహించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.