ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. జన జీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా వరద నీరు రోడ్ల పైకి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు.. రాష్ట్రంలో కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కృష్ణా, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది.
శుక్రవారం ఎగువ నుంచి వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో 10 క్రస్ట్ గేట్లను, 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. అయితే రాత్రి కురిసిన వర్షాలకు వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉండటంతో.. అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి 4,43,293 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.6 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మరోవైపు శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 4,43,329 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 4,04,137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటి వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో దాదాపు రెండు నెలలుగా కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది.
ఇక ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చేనట్లే దిగువకు వదులుతున్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే హెచ్చరించి, తగిన జాగ్రత్తలు చెప్తున్నారు.