హెబ్బా పటేల్.. ఈ పేరు చెప్పగానే మన కళ్లముందు ఓ అందమైన రూపం గుర్తొస్తుంది. ఇన్నాళ్లూ హెబ్బా పటేల్ చేసిన రోల్స్ అలాంటివి మరి. కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ రోల్స్ మాత్రమే చేసింది. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయింది. రీసెంట్ గా రామ్ సరసన ఐటెంసాంగ్ కూడా చేసి తన ఒంపులతో రచ్చ రచ్చ చేసింది ఈ గుజరాతీ బ్యూటీ.
ఇలా అందాలే పెట్టుబడిగా ఇండస్ట్రీని ఏలుతున్న హెబ్బా పటేల్, ఉన్నట్టుండి సడెన్ గా రూటు మార్చింది. గ్లామర్ కు కేరాఫ్ గా ఉన్న ఈ అందగత్తె, ఇప్పుడు నటించడానికి స్కోప్ ఉండే పాత్రల్ని మాత్రమే ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్చానికి గురిచేస్తోంది. అది కూడా ఆమె పాత్రలతో ప్రయోగాలు చేయడానికి సిద్ధమైంది.
ఇప్పటికే ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా పూర్తిచేసింది హెబ్బా. ఇందులో ఆమెది పూర్తిగా డీ-గ్లామరైజ్డ్ రోల్. ఎలాంటి మేకప్ లేకుండా నటించింది. ఇప్పుడు దీన్ని మించిన మరో ప్రయోగంతో రెడీ అయింది ఈ చిన్నది. ఆ ప్రయోగం పేరు గీత.
అవును.. హెబ్బా పటేల్ నటించిన తాజా చిత్రం గీత. ఈ సినిమాలో ఆమె మూగ అమ్మాయిగా నటించింది. మామూలుగా మూగ అమ్మాయిగా నటించడం పెద్ద కష్టమైన పని కాదు, ప్రాక్టీస్ తో వచ్చేస్తుంది. కానీ గీత సినిమాలో మూగ అమ్మాయిగా నటిస్తూనే, మూగ భాష (చేతులతో సంజ్ఞలు చేయడం) కూడా అభినయం చేసి చూపించింది హెబ్బా. దీని కోసం ఆమె ప్రత్యేకంగా కొన్నాళ్ల పాటు ట్రయినింగ్ తీసుకుంది.
పూర్తిగా హెబ్బా పటేల్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఆమె పూర్తిస్థాయిలో మూగమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాతో తన ఇమేజ్ పూర్తిగా మారిపోతుందని భావిస్తోంది హెబ్బా. గ్లామర్ పాత్రలతో పాటు నటించడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్స్ కూడా తన కోసం వస్తాయని నమ్ముతోంది. విశ్వ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే హెబ్బా చేతుల మీదుగా ‘గీత’ నుంచి మరిన్ని సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి.