ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ని బుధవారం ఉదయం తమిళనాడులోని ఈరోడ్ లో అత్యవసరంగా దింపారు. ఈ జిల్లాలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోగల ‘ఉకినియం’ అనే గిరిజన గ్రామంలో హెలికాఫ్టర్ దిగింది. వాతావరణం బాగులేని కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పలేదని తెలుస్తోంది. రవిశంకర్, ఆయన ఇద్దరు సహచరులు, మరో ముగ్గురు, పైలట్ సురక్షితంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రైవేట్ హెలికాఫ్టర్ లో బెంగుళూరు నుంచి రవిశంకర్ తిరుపూర్ ప్రయాణిస్తుండగా 10.15 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో పైలట్ హెలికాఫ్టర్ ని నడపలేకపోయాడని, ముందు జాగ్రత్త చర్యగా ఉకినియంలో దింపాడని కదంబుర్ పోలీస్ ఇన్స్పెక్టర్ వడివేల్ కుమార్ చెప్పారు.
సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీఎల్, సుందరం అభ్యర్థనపై తమిళనాడు పీఎంఎస్ రాష్ట్ర కోశాధికారి కె.రామస్వామి హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే అప్పటికే క్లియరెన్స్ రావడంతో హెలికాఫ్టర్ అక్కడి నుంచి బయలుదేరింది. ఈ కుగ్రామంలో హెలికాఫ్టర్ సుమారు గంటసేపు ఉండిపోయింది.
చివరకు పదకొండున్నర గంటల ప్రాంతంలో తిరుపూర్ కు బయల్దేరింది. ఈ జిల్లాలోని శ్రీ ఆంధ్రకపాలీశ్వర స్వామి ఆలయంలో జరిగే కుంభాభిషేకానికి హాజరయ్యేందుకు రవిశంకర్ వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఓ స్టేట్మెంట్ లో తెలిపింది. శ్రీశ్రీ రవిశంకర్ కు దేశవిదేశాల్లో లక్షలాది భక్తులున్నారు.