ఉక్రెయిన్లో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని కీవ్ శివార్లలోని బ్రోవరీ ప్రాంతంలో ఓ కిండర్ గార్డెన్ వర్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరణించిన వారిలో ఆ దేశ హోం మంత్రితో పాటు డిప్యూటీ హోంమంత్రి, ఆ శాఖ కార్యదర్శి సహా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ ఘటనలో మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ, హోంశాఖ సహాయ మంత్రి యెవెన్ యెనిన్, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరి లుబ్కోవిచ్ మరణించారని ఉక్రెయిన్ నేషనల్ పోలీస్ చీఫ్ ఇహోర్ క్లైమెన్కో పేర్కొన్నారు. ఇది ప్రమాదవ శాత్తు జరిగిందా లేదా దీని వెనుకు ఎవరి హస్తమైనా ఉందా? అనే విషయం తేలాల్సి వుందన్నారు.
ఈ ప్రమాదంలో మొత్తం 29 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరిలో 15 మంది పిల్లలు ఉన్నట్టు చెప్పారు. రష్యా యుద్దం మొదలైనప్పటి నుంచి హోం మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రష్యా యుద్దం గురించి దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిని జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తూ వస్తున్నారు.
హెలికాప్టర్ ఉక్రెయిన్ లోని అత్యవసర సేవలకు సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. హోం మంత్రి వార్ హాట్ స్పాట్ ఏరియాకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడంచారు. ప్రమాదం నేపథ్యంలో కిండర్ గార్డెన్ సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి తరలించినట్టు వివరించారు.