బెంగళూరు వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హెలికాప్టర్ సేవలు మొదలయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయాల మధ్య హెలికాప్టర్ సర్వీసులను ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించనుంది.
సాధారణంగా హెచ్ఏఎల్ నుంచి విమానాశ్రయానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. తాజాగా హెలికాప్టర్ సర్వీసులను తీసుకు వస్తుండటంతో ఆ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గనుంది. దీంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్లేడ్ ఇండియా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరులో హెలికాప్టర్ సర్వీసులను బ్లేడ్ కంపెనీ నిర్వహిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రెండు హెలికాప్టర్లను ఈ రూట్ లో నడపనున్నారు. నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది.
ఇక నుంచి హన్నూర్ లోని బీకే హల్లి బ్లేడ్ హెలిప్యాడ్ నుంచి బెంగళూరు సిటీ సెంట్రల్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపింది. ఎయిర్ పోర్టు నుంచి బ్లేడ్ హెలిప్యాడ్ వద్దకు ప్రయాణీకులను తీసుకు వెళ్లిందేకు బస్సును ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు.