ఏపీ సర్కార్ రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షో లపై మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్, పంచాయితీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు ప్రకారంగా ఉన్న నిబంధనలను మార్గదర్శకాలుగా సూచించింది. ఇక ముందు రోడ్లపై బహిరంగ సభలు,ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించేటప్పుడు తప్పని సరిగా అవి ఫాలో అవ్వాల్సిందేనని కండీషన్ పెట్టింది.
రోడ్డు మార్జిన్ల దగ్గర అదే విధంగా పంచాయితీ రహదారుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో జన సమూహం భారీగా తరలి వచ్చే సభలకు అనుమతులివ్వొద్దని అధికారులకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గుంటూరు, కందుకూరు సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల దృష్ట్యా ఏపీ హోం శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశాలు గుర్తించి అప్పుడే అనుమతులివ్వాలని సూచిందింది.
దీంతో సభలు, రోడ్డు షోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు పంపారు అధికారులు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు నాయుడు నెల్లూరులో నిర్వహించిన కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన మర్చిపోక ముందే బాబు గుంటూరు జిల్లా వికాస్ నగర్ లో నిర్వహించిన సభలోను ముగ్గురు మహిళలు తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయారు.అయితే చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో రోడ్ షో, సభలు నిర్వహించడం కారణంగానే ఈ సంఘటనలు జరిగాయని వైసీపీ విమర్శిస్తోంది. దీని కోసమే ఈ మార్గదర్శకాలను సూచించడం జరిగింది.