ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె జీవితం అసాధరణమైనదని ప్రధాని కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాంకు ఉన్నటువంటి ఉత్సాహం, సెంటిమెంట్ ముర్ముకు కూడా ఉందని ఆయన అన్నారు.
2002లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్ కలాం పేరును బీజేపీ ప్రతిపాదించినప్పుడు ప్రజలు దానికి అంగీకారం తెలిపారని, ఇప్పుడు ద్రౌపది ముర్ము విషయంలోనూ బీజేపీ నిర్ణయంపై ప్రజలు అలాగే ఆమోదం తెలిపారని ప్రధాని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థ యశ్వంత్ సిన్హాలు మాత్రమే చివరకు పోటీలో మిగిలారు. దీంతో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియను జూలై 18న నిర్వహించనున్నట్టు రాజ్యసభ కార్యదర్శి పీసీ మోడీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని 63వ నెంబర్ గదిలో ఓటింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.