అర్ధరాత్రి జనం అంతా గాఢ నిద్రతలో ఉన్నారు. వేసవి కాలం కావటం, పైగా సముద్ర తీర ప్రాంతం కావటంతో ఉండే ఉక్కపోతను తట్టుకోవటానికి జనం అంతా కిటికీలు, డోర్లు తెరుచుకొని పడుకున్నారు. తమను హాయిగా నిద్రపుచ్చే గాలి… శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లిపోతుందని ఊహించ లేదు. ఎల్జీ పాలిమర్స్ నుండి వెలువడిన విష వాయువుతో జనం ఎక్కడి వారక్కడ పిట్టల్లా పడిపోయారు.
చిన్నారులు, ఆరోగ్య సమస్యలున్న వారు అందరిలా విష వాయువు నుండి బయట పడేందుకు దూరంగా పరుగెత్తలేకపోయారు. ఫలితంగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే 10మంది మరణించగా… కుందన శ్రేయ (6), ఎన్.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో మరికొందరు మరణించారు. ఇందులో చంద్రమౌళి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంజీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక విశాఖ కేజీహెచ్ తో పాటు నగరంలోని పలు ఆసుపత్రుల్లో దాదాపు 350మంది వరకు చికిత్స తీసుకుంటారు. కంపెనీ నుండి లీకైన విష వాయువు నేరుగా ఊపిరితిత్తులపై, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, చాలా డేంజర్ అని వైద్యులంటున్నారు. వెంటిలేటర్ ఉన్న చికిత్స అందించటమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తున్నారు.