కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రద్దయిన దేశీయ ప్రయాణికులు విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో మే 25 నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో రాకపోకల విషయంలో ప్రయాణికులు పాటించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది.
ఎయిర్‌పోర్టులు, విమానాల్లో పాటించాల్సిన నిబంధనలు
1. ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.
2. ఆరోగ్య సేతు యాప్ ప్రతీ ఒక్కరూ విధిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి(14 ఏళ్ల లోపు పిల్లలు ఇందుకు మినహాయింపు). లేనిపక్షంలో వారిని లోపలికి అనుమతించరు.
3. రెండు గంటలకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.
4. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా, ప్రైవేటు టాక్సీలను అందుబాటులో ఉంచాలి.
5. ప్రయాణీకులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు వ్యక్తిగత, ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
6. ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి. సీటింగ్ విషయంలో భౌతిక నిబంధనలు తప్పక పాటించాలి.(మార్కింగ్‌ను అనుసరించి)
సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి.
7. అరైవల్, డిపార్చర్ సెక్షన్ల వద్ద ట్రాలీలకు అనుమతి లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో రసాయనాల పిచికారీ అనంతరం మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది.
8. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ముందే బ్యాగేజీని శానిటైజ్ చేసేందుకు ఆపరేటర్లు ఏర్పాట్లు చేయాలి.
గుంపులు గుంపులుగా లోపలకు రావడం నిషిద్ధం.
ప్రవేశ ద్వారాలు, స్క్రీనింగ్ జోన్లు, టెర్మినల్స్ వద్ద కనీసం మీటరు దూరం పాటించాలి.
9. ప్రవేశద్వారాల వద్ద బ్లీచులో నానబెట్టిన మ్యాట్లు, కార్పెట్లు పరచాలి. కౌంటర్ల వద్ద ఫేస్‌షీల్డులు లేదా ప్లెక్సీగ్లాసు ఉపయోగించాలి.
10. లాంజ్‌లు, టర్మినల్ బిల్డింగుల వద్ద న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు అందుబాటులో ఉండవు.
11. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులను ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు.
12.విమానం దిగిన తర్వాత బ్యాచ్‌ల వారీగా క్రమపద్ధతిని అనుసరించి ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులోపలికి వెళ్లాలి.