ఆధార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అత్యవసరం అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందడం కోసం మాత్రమే కాదు, బ్యాంకు లావాదేవీలు, ఇతర అవసరాలకు ఆధార్ కచ్చితంగా కావల్సి వస్తోంది. అయితే ఆధార్‌ను ఉపయోగించేవారు మొబైల్ నంబర్‌ను అప్‌డేటెగ్‌గా ఉంచుకోవాలి. ఇక కొందరు ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందోనని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు ఆధార్ కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను ఇలా సులభంగా వెరిఫై చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.
ఆధార్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://resident.uidai.gov.in/verify-email-mobile అనే లింక్ ను ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. దీంతో ఆధార్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌లను ఎంటర్ చేయాలి. తరువాత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కరెక్టే అయితే రికార్డులలో మ్యాచింగ్ ఉన్నట్లు చూపిస్తుంది. దీంతో అదే ఫోన్ నంబర్ ఆధార్ కు లింక్ అయి ఉన్నట్లు నిర్దారించుకోవచ్చు.
అయితే ఈ-మెయిల్ ఐడీని వెరిఫై చేయాలనుకునేవారు పైన తెలిపిన స్టెప్స్‌లో మొబైల్ నంబర్ కు బదులుగా ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఓటీపీ వస్తుంది. అనంతరం దాన్ని కన్‌ఫాం చేస్తే సదరు ఈ-మెయిల్ ఐడీ ఆధార్‌తో లింక్ అయి ఉంటే రికార్డుల్లో మ్యాచింగ్ ఉన్నట్లు చూపిస్తుంది. ఇలా ఆధార్‌తో లింక్ అయి ఉండే మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను సులభంగా వెరిఫై చేసుకోవచ్చు.
అయితే పైన తెలిపిన సందర్భాల్లో రికార్డుల్లో మ్యాచ్ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అలాంటప్పుడు పౌరులు తమకు సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ ఆధార్‌తో మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీలను అనుసంధానం చేయించుకోవచ్చు.