బాలయ్యకు కోపమొచ్చినా సంతోషమొచ్చిన హై ఓల్టేజ్ లోనే ఉంటుంది. అయితే ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ పలికిన మాట విమర్శలకు దారితీసింది. దీంతో ఆ వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు. బాబాయ్(అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని ఆయన అన్నారు.
తన నియోజకవర్గం హిందూపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయి లాంటి వారు.. అభిమానంతోనే యాధృచ్ఛికంగా అన్నానని చెప్పారు. ‘‘ఎన్టీఆర్ ని ఎన్టీవోడు అనేవారు. నేను ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తుంటే బాలయ్య వెళ్తున్నాడనే అంటారు. అది అభిమానంతో అన్నదే తప్ప కించపరిచినట్టు కాదు’’ అని పేర్కొన్నారు.
ప్రతిమాటకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు బాలకృష్ణ. నాగేశ్వరరావు ఆయన పిల్లలకంటే ఎక్కువగా తననే ప్రేమించే వారని గుర్తు చేశారు. అంతేకాదు, ‘‘నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాం. బాబాయ్ పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా డోంట్ కేర్’’ అని స్పష్టం చేశారు బాలయ్య.
ఇటు ఎస్వీ రంగారావు మనవళ్లు కూడా ఈ విషయంపై స్పందించారు. ‘‘బాలయ్య ఉద్యేశపూర్వకంగా అన్నది కాదు. మా కుంటుంబంతో ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. చిన్న విషయాన్ని సాగదీసి వివాదంగా మార్చొద్దు’’ అని బాలయ్యకు మద్దతుగా మాట్లాడి వీడియో రిలీజ్ చేసి వివాదానికి ముగింపు పలికారు