ఎనర్జిటిక్ స్టార్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో ఓ మాస్ మూవీ రూపొందుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. జాతర నేపథ్యంలో దున్నపోతును కంట్రోల్ చేసే మాస్ హీరోగా ఈ పోస్టర్ లో రామ్ కనిపిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ లో చెప్పారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు రామ్. ప్రస్తుతం ఆశలన్నీ బోయపాటి మూవీ పైనే పెట్టుకున్నాడు. ఇక ఇందులో రామ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తోంది.
ప్రస్తుతం షూటింగు దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. యూట్యూబ్ హిందీ డబ్బింగ్‌ల ద్వారా రామ్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.