లాక్ డౌన్ టైమ్ లో సత్యదేవ్ మార్కెట్ బాగా పెరిగింది. చకచకా సినిమాలు పూర్తి చేయడంతో పాటు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకోవడంతో సత్యదేవ్ సినిమాల్ని మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ క్రమంలో అతడి మార్కెట్ సినిమా, సినిమాకు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ మార్కెట్ రేటు అందుకుంటున్నాడు ఈ హీరో.
ప్రస్తుతం గోపాలకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే.. కొరటాల శివకు ఈ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరించేందుకు అంగీకరించాడు కొరటాల. అలా ఈ సినిమా రేంజ్ పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్లో ఈ సినిమాపై చాలా బజ్ నడుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో నాన్-థియేట్రికల్ రేట్లు దాదాపు 18 కోట్ల రూపాయలకు పలుకుతోంది. ప్రస్తుతం ఇదే రేటుపై వివిధ ఛానెళ్లతో చర్చలు సాగుతున్నాయి. డీల్ లాక్ అయితే సత్యదేవ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మార్కెట్ డీల్ ఇదే అవుతుంది.
సత్యదేవ్ నటించిన గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయినపప్పటికీ ఈ సినిమాల నాన్-థియేట్రికల్ రైట్స్ మంచి రేట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడీ తాజా చిత్రంతో ఆ రేటు మరింత పెరగనుంది.
సత్యదేవ్ నుంచి రీసెంట్ గా వచ్చిన తిమ్మరుసు సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ అతడికి మార్కెట్ తగ్గకపోవడం విశేషం.