ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు కొందరు కేటుగాళ్లు. చట్టానికి చిక్కమనే ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. చివరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఓ బిజినెస్ మెన్ కిడ్పాప్ కు విఫలయత్నం చేశారు. హీరో షోరూమ్ యజమాని సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి కారులో కిడ్నాప్ కి ప్రయత్నించారు దుండగులు.
వివరాల్లోకి వెళ్తే.. కిస్మత్‌పుర్ కు చెందిన వ్యాపారవేత్త తన కారులో షో రూమ్ కి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో కిస్మత్ పుర్ బ్రిడ్జ్ దాటగానే డ్రైవర్ వాష్ రూమ్ కని కారు ఆపాడు.
ఈ లోపు అకస్మాత్తుగా ముగ్గురు కారులోకి ఎక్కారు. సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి మాస్క్ పెట్టారు. కారు స్టార్ట్ చేసి అత్తాపూర్ వైపు వెళ్తున్నారు. ఈ లోపు తేరుకున్న సాయి కిరణ్ కారులో నుండి కిందకు దూకేశాడు.
హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. జరిగిన స్టోరీ అంతా వివరించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్స్ ను పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.