మలేషియాలో తన ‘బిచ్చగాడు-2’ (పిచ్చైక్కరన్-2) సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ బోటులో ఓ సీన్ షూట్ చేస్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న బోటు అదుపు తప్పి కెమెరా ఉన్న మరో పెద్ద బోటులోకి దూసుకుపోవడంతో విజయ్ ఆంటోనీ గాయపడ్డాడు. ఆయనను చిత్ర సిబ్బంది హుటాహుటిన కౌలాలం పూర్ లోని ఆసుపత్రికి తరలించారు.
తమిళంతో బాటు తెలుగులో కూడా ఈ హీరో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు స్వయంగా మొదటిసారిగా విజయ్ తానే మెగా కెమెరా కూడా పట్టుకోవడం విశేషం. ఈ సమ్మర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ఆయన ప్లాన్.
మలేషియాలోని లాంగ్ కావీ దీవిలో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటున్నాడని తెలిసింది.
ఆ దేశంలోని వివిధ లొకేషన్స్ లో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక విజయ్ ఆంటోనీ తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ప్రమాదవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు మలేషియాకు బయల్దేరి వెళ్లారు.