టాలీవుడ్ లో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. వస్తే ఫ్యాక్షన్ కథలన్నీ కట్టగట్టుకొని వస్తాయి. లేదంటే ప్రేమకథల సీజన్ మొదలవుతుంది. ఒక సందర్భంలో వరుసపెట్టి డ్యూయల్ రోల్ సినిమాలొచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరో ట్రెండ్ టాలీవుడ్ లో మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న కొత్త ట్రెండ్, ప్రభుత్వ అధికారుల పాత్రలు.
హీరోలంతా ఈ తరహా పాత్రలే పోషిస్తున్నారు. ఉదాహరణకు అల్లరి నరేష్ నే తీసుకుంటే, ఈ హీరో ప్రస్తుతం “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎలక్షన్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అల్లరోడు. కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి రోల్ చేయలేదు అల్లరి నరేష్. ఈ సినిమా కూడా సీరియస్ మూవీలానే ఉంది.
తాజాగా రిపబ్లిక్ అనే సినిమా వచ్చింది. ఇందులో సాయితేజ్ జిల్లా కలెక్టర్ గా నటించాడు. తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా సెట్స్ పై ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నితిన్ కూడా జిల్లా కలెక్టర్ గా, ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.
వీటితో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా కూడా వస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో మాస్ రాజా ఆర్డీవోగా కనిపించబోతున్నాడు. ఇక ఆమధ్య ఓటీటీలో వచ్చిన టక్ జగదీశ్ సినిమాలో నాని కూడా ఎమ్మార్వోగా కనిపించాడు.
ఇలా టాలీవుడ్ లో హీరోలంతా ప్రభుత్వ అధికారుల పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హీరోలు ఇలాంటి పాత్రల వైపు మొగ్గుచూపుతారో చూడాలి.