ఈ మధ్య కాలంలో పాక్ డ్రోన్లతో రెచ్చిపోతుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని గుర్తించి..తిప్పికొట్టడమే సైన్యానికి సవాలుగా మారింది. తాజాగా పంజాబ్ లోని తారన్ తరన్ జిల్లాలో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఓ డ్రోన్ సంచరిస్తుండటాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన జవాన్ లు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్ ను అడ్డగించడంతో దాన్ని తిరిగి వెనక్కి పాక్ తీసుకుంది.
అయితే డ్రోన్ తచ్చాడిన ప్రదేశాన్ని సైనికులు తనిఖీ చేయగా.. కాలియా గ్రామం పరిధిలో రెండున్నర కేజీల ఒక ప్యాకెట్ లభ్యమైంది. ఆ ప్యాకెట్ లో హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో..అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే పంజాబ్ యువతను మత్తుకు బానిసలుగా చేయాలనే కుట్రతో పాక్ ఇలా.. డ్రోన్ ల ద్వారా ఇక్కడికి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు సైనికులు అనుమానిస్తున్నారు.
ఇక టెర్రరిస్టులను సరిహద్దుల గుండా భారత్ లోకి పంపిస్తున్న పాక్.. ఆ ఉగ్రవాదుల అవసరాలను తీర్చడానికి ఇలా తరుచూ డ్రోన్లను వినియోగిస్తుంటుంది.