– దేశంలోకి విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు
– మత్తు చిత్తులో యువత
– అందరి చూపు ముంద్రా పోర్టు వైపే!
అదానీకి చెందిన ముంద్రా పోర్టుపై ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. ఒకే ఓడరేవులో 3 సార్లు మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పటికీ ఎలాంటి చర్యలు లేవన్నారు. అక్కడి నుంచే మాదక ద్రవ్యాలు నిరంతరం ఎలా వస్తున్నాయంటూ అనేక సందేహాలు వెలిబుచ్చారు. దీంతో అదానీ పోర్టు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జోరందుకుంది.
పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడినా పోర్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో రూ.21,000 కోట్లకు పైగా విలువైన దాదాపు 3వేల కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోర్టును నడుపుతున్న అదానీ గ్రూప్ పై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో పోర్టు అధికారుల తీరుపై ప్రతిపక్షాలు అనేక పశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదానీ పోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులకు పోలీసింగ్ అధికారాలు లేవని, అందుకే కంటైనర్లలో ఏముందో చెక్ చేయలేమని తెలిపింది. కానీ.. ఇరాన్, అప్ఘనిస్తాన్, పాక్ నుంచి వచ్చే కంటైనర్లకు దూరంగా ఉంటామని ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే బందర్ అబ్బాస్ నుండి జూన్ 2021లో ముంద్రాకు ఓ కంటైనర్ కార్గో వచ్చింది. దీనిపై భారత కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ యొక్క డేటా అనలిటిక్స్ విభాగం నేషనల్ కార్గో ట్రాకింగ్ సిస్టమ్ పోర్టు అధికారులను హెచ్చరించింది. కానీ, వీటిని పట్టించుకోకుండా కార్గోకు అధికారులు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోర్టులో కొందరు అధికారులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇప్పుడు ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇది తమదేనంటూ ఎవరూ క్లెయిమ్ చేయకపోడంతో వందల కిలోల మాదక ద్రవ్యాలు పోర్టులో పడి ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 2022 జూలైలో పోర్టు వెలుపల ఉన్న కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ నుండి 75 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కంటైనర్ వచ్చి అప్పటికే రెండు నెలలు దాటినట్టు తెలుస్తోంది. ఇలా గతంలో పలు ఘటనలు జరగ్గా అధికారుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పదే పదే మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న పోర్టులో తనిఖీలు పటిష్టం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.