కంటైనర్ల నిండా డ్రగ్స్… టాల్కం పౌండర్ పేరుతో రవాణా.. ఆఫ్ఘాన్ టూ విజయవాడ లింకులు.. మత్తు దందాకు బలవుతున్న యువకులు. చూస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ కన్ను బెజవాడపై పడినట్టే ఉంది. సుమారు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను గుజరాత్ లో పట్టుకున్నారు అధికారులు.
అఫ్ఘాన్ నుంచి విజయవాడకు టాల్కం పౌడర్ పేరుతో కంటైనర్ లలో అక్రమంగా డ్రగ్స్ రవాణా అవుతోంది. ఫ్రమ్ అడ్రస్.. కాందహార్ కు చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థది కాగా… టూ అడ్రస్.. విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ కంపెనీది. కన్ సైన్ మెంట్ లో ఉన్న అడ్రస్ ద్వారా కూపీ లాగుదామని సత్యనారాయణపురం వెళ్లారు అధికారులు.
కంటైనర్లలో ఉన్న పౌడర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించి హెరాయిన్ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అధికారులు. వారిలో ఇద్దరు అఫ్ఘాన్ జాతీయులు ఉన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. గోవిందరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
అతిపెద్ద డ్రగ్ రాకెట్ లో బెజవాడ లింకులు బయటపడడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద మొత్తంలో తీసుకొస్తున్న హెరాయిన్ ను ఏ రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు..? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా..? లాంటి పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. అయితే నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా కూపీ లాగుతున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం.
సోలార్ ప్లేట్ల ఏర్పాటు పనుల పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్ కంపెనీని మాచవరం సుధాకర్ అనే వ్యక్తి ప్రారంభించినట్టు తెలిసింది. కంపెనీ ఏర్పాటు ఇక్కడ జరిగినప్పటికీ కార్యకలాపాలు మాత్రం చెన్నై కేంద్రంగా నడుస్తున్నాయని సమాచారం.