ట్రాఫిక్ డీసీపీ కారును ఢీ కొట్టి, ఆయనతో దుర్బాషలాడారంటూ తనపై నమోదైన కేసుపై టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి స్పందించారు. ఈ విషయంపై తాను ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదన్నారు. ఇప్పటి వరకు తనకు అండగా నిలిచిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అభిమానులు సహనంతో ఉండాలని ఆమె కోరారు. తనపై నమోదైన కేసు విషయంలో తన లీగల్ టీమ్ త్వరలోనే బదులిస్తుందని ట్వీట్ చేశారు. ఇది ఇలా వుంటే డింపుల్ హయాతికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో నోటీసులపై ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ స్పందించారు.
తన క్లైంట్ డింపుల్ తో డీసీపీ రాహుల్ హెగ్డే అనేక సార్లు అమర్యాదగా ప్రవర్తించారని వెల్లడించారు. ఆమె పార్కింగ్ చేసే స్థలంలో కోన్స్ పెట్టారని ఆరోపించారు. పలు మార్లు చెప్పినా డీసీపీ వినలేదన్నారు. ఈ క్రమంలో ఆమె అసహనానికి గురై కోన్స్ ను కాలితో తన్నారని చెప్పారు.
డీసీపీపై కేసు పెడతానని డింపుల్ హెచ్చరించడంతోనే ఆమెపై కేసులు పెట్టారని వివరించారు. హయాతిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. డింపుల్ ను వేధించాలన్నదే డీసీపీ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. రాహుల్ హెగ్డే తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
ఒక డీసీపీ స్థాయిలో ఉన్న అధికారికి ఓ మహిళతో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఒక సెలబ్రిటీ కావడంతో ఓ పోలీసు అధికారిపై కేసు పెట్టే విషయంలో వెనకాడిందన్నారు. కానీ డీసీపీ మాత్రం తన డ్రైవర్‌తో కేసు పెట్టించారని పేర్కొన్నారు. ఈ విషయంలో కేసు పెట్టేందుకు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లారన్నారు.
కానీ అక్కడ ఆమె ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదన్నారు. సుమారు మూడు గంటల పాటుే పోలీస్‌స్టేషన్‌లోనే డింపుల్ ను కూర్చోబెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.