సినిమా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారో గాని ఒకప్పుడు మాత్రం చాలా సరదాగా సన్నిహితంగా, స్నేహంగా ఉండే వారు అనే మాట వాస్తవం. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే కలిసి మెలిసి ఉండేవారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, సావిత్రి, భానుమతి, సూర్యకాంతం ఇలా అందరూ చాలా కలిసి మెలిసి ఉండేవారు. అక్కినేని, ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా అప్పట్లో హీరోయిన్లతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో మంచి చనువు ఉండేది.
అలా ఎన్టీఆర్ ఒక నటిని అమ్మ అని పిలిచేవారు. ఆ నటి ఎవరు, ఏంటీ అనేది చూద్దాం. ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన గుండమ్మ కథ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో అత్తగా నటించిన సూర్యకాంతం ను చివరి వరకు ఎన్టీఆర్, అక్కినేని ఇద్దరూ అత్త అని పిలిచేవారు. ఇక చిత్తూరు నాగయ్య విషయానికి వస్తే ఆయన తొలి తరం హీరో. ఎన్టీఆర్, అక్కినేని ఇద్దరికీ ఆయన గురువు.
దీనితో తండ్రిలా భావించి నాన్న అని పిలిచేవారట. ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎన్నో సినిమాల్లో నటించేవారు. హీరో హీరోయిన్లుగా చేసినా సోదరిగానే చూసారు ఎన్టీఆర్. అందుకే ఆమెను సావిత్రమ్మ అని ఇష్టంగా పిలిచేవారు. తొలి తరం హీరోయిన్ గా చేసిన పండరీ భాయితో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆమె 30 సినిమాల్లో ఎన్టీఆర్ కు అమ్మగా చేసేవారు. దీనితో ఆమెను అమ్మ అని పిలిచేవారు అని చెప్తారు.