హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేశారు. కొంత మంది తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆమె అన్నారు. దీని వెనుక బాలీవుడ్ మాఫియా హస్తం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయంలో ఎవరైనా తనకు ఏదో విధంగా సాయం చేయాలంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా కోరారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ సుదీర్ఘమైన పోస్టును ఆమె పెట్టారు.
గతంలో మీటూ వేధింపుల సమయంలో తాను కొందరిపై ఆరోపణలు చేశానని, వారే ఇప్పుడు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో వారు తన సినిమాలు ఆడకుండా కుట్రలు చేశారని చెప్పారు.
తన పని మనిషిని కూడా వారు లోబర్చుకున్నారని, ఇప్పుడు తన పని మనిషి తనకు వ్యతిరేకంగా వ్యవహరించేలా చేశారని ఆమె అన్నారు. తనకు ఆమెతో బలవంతంగా స్టెరాయిడ్లు, కొన్ని రకాల మందులు పెట్టించారని ఆమె పేర్కొన్నారు.
దీంతో ఈ బాధలు భరించలేక పోయానని, అందుకే రెండు నెలల కిందట తాను ఉజ్జయినికి పారిపోయానని వివరించారు. కానీ ఇప్పటికీ వారు తనను వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు తన బైకు బ్రేకులను వారు తీసేసి ప్రమాదాలు జరిగేలా చేశారని చెప్పారు.
తాను ధైర్యంతో మరణం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ సాధారణ జీవితం గడుపుదామని ముంబైకి వచ్చానన్నారు. ఇక తాను పారిపోయే ప్రసక్తే లేదన్నారు. ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేయబోననన్నారు. కష్టపడి తన కెరీర్‌ని తిరిగి నిర్మించుకుంటానన్నారు.