ప్రతి ఒక్కరికి ఓ టేస్ట్ ఉంటుంది. మన హీరోయిన్లకు కూడా అలాంటి వ్యక్తిగత అభిరుచులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు నివేత పెతురాజ్ నే తీసుకుంటే, ఆమెకు రేస్ కార్లంటే చాలా ఇష్టం. జాన్వి కపూర్ కు పెయింటింగ్ అంటే ఇష్టం. ఇలా ఏ హీరోకు ఏదిష్టమో చూద్దాం.
నివేత పెతురాజ్
ఈ ముద్దుగుమ్మకు క్రీడలంటే ఇష్టం. చిన్నప్పుడు ఫుట్ బాల్ ఎక్కువగా ఆడేది. ప్రస్తుతం కారు రేసులపై మనసు పారేసుకుంది. తాజాగా ఫార్ములా రేస్ కారు ట్రైనింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ కూడా పొందింది. దీంతో పాటు కార్లు సేకరించడం కూడా హాబీ. ఈమె దగ్గర డాడ్జ్ ఛాలెంజర్ ఉంది.
జాన్వికపూర్
తెరపై ఎంత హాట్ గా కనిపిస్తుందో, నిజజీవితంలో అంత సెన్సిటివ్. ఈమె వేసే పెయింటిగ్స్ చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. అవును.. జాన్వి కపూర్ హాబీ పెయింటింగ్. ఇప్పటికే చాలా పెయింటింగ్స్ వేసింది. కొన్నింటిని బయటపెట్టింది. మరికొన్నింటిని దాచేసింది. వాటితో ఎగ్జిబిషన్ పెట్టాలనేది ఆలోచన.
నభా నటేష్
నభా నటేష్ కు కూడా పెయింటింగ్ అంటే హాబీ. లాక్ డౌన్ టైమ్ లో ఓవైపు అందాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు తన మనసుకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ హాబీని కొనసాగించింది. 2-3 రోజులు షూటింగ్ గ్యాప్ వస్తే పెయింట్ బ్రష్ పట్టుకోవడమే తన తొలి ప్రాధాన్యం అంటోంది.
సమంత
సమంత హాబీ ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. అవును.. టెర్రస్ గార్డెనింగ్ ఈమె హాబీ. తనే సొంతంగా కూరగాయలు పండించుకొని, వాటినే వండుకొని తినడం సమంతకు ఇష్టం. క్యారెట్, క్యాప్సికమ్, బెండకాయలతో పాటు ఎన్నో రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తోంది సమంత.
తమన్న
మిల్కీబ్యూటీ తమన్న హాబీ ఏంటో తెలుసా..? ఈమెకు జ్యూవెలరీ సేకరించడం హాబీ. ఈమె తండ్రి వజ్రాల వ్యాపారి. బహుశా, అలా ఆమెకు ఈ అలవాటు వచ్చి ఉంటుంది. ఎయిర్ పోర్టుల్లో ఫ్రీ టైమ్ దొరికినప్పుడు, షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు రకరకాల డిజైన్స్ తో ఉండే ఆభరణాలు కొనడం తమన్న హాబీ.
కాజల్
రెజ్యూమ్ రాసేటప్పుడు రీడింగ్ బుక్స్ అని రాసేయడం చాలా కామన్. కానీ కాజల్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్. ఆమెకున్న ఏకైక హాబీ పుస్తక పఠనం. వారానికో నవల ఈజీగా చదివేస్తుంది. లాక్ డౌన్ టైమ్ లో ఎన్ని బుక్స్ చదివిందో లెక్కలేదు. పుస్తక పఠనం విషయంలో ఫిక్షన్, నాన్-ఫిక్షన్, డివోషనల్ అనే తేడా లేదు. ఇప్పటికీ మంచి పుస్తకం ఏదైనా చదవాలనుకుంటే చాలామంది హీరోహీరోయిన్లు కాజల్ సలహా తీసుకుంటారు.
పూజా హెగ్డే
పూజా హెగ్డేకు సాగర తీరాలంటే చాలా ఇష్టం. ఫ్రీ టైమ్ దొరికితే బీచ్ లో గడపడం ఈమెకు ఇష్టం. జాగ్రత్తగా గమనిస్తే ఆమె వ్యక్తిగత ఫొటోలు ఎక్కువగా బీచ్ బ్యాక్ గ్రౌండ్ లోనే కనిపిస్తాయి. షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్తే, పూజా హెగ్డే ముందుగా చేసే పని దగ్గర్లో బీచ్ ఎక్కడుందా అని వెదుక్కోవడం.
కంగనా రనౌత్
సమంతలానే కంగనా రనౌకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అయితే సమంత తన కోసం ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటుంది. కంగనా మాత్రం పూల మొక్కలు పెంచుతుంది. రంగురంగుల పూలమొక్కలు ఇంటి చుట్టూ పెంచుతుంది. ఈ విషయంలో అమ్మే తనకు మార్గదర్శి అంటోంది ఈ ‘క్వీన్’.
పాయల్ రాజ్ పుత్
హీరోయిన్లలో తిండిబోతులు తక్కువగా ఉంటారు. ఎక్కువగా తింటే లావెక్కిపోతామనే భయం వీళ్లది. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం దీనికి రివర్స్. రకరకాల వంటకాలు టేస్ట్ చేయడం ఈమె హాబీ. సమయం దొరికితే చాలు బాయ్ ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్లు చుట్టేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే ఎన్నో దేశీ వంటకాల్ని టేస్ట్ చేసిన పాయల్, ప్రస్తుతం మిడిల్-ఈస్ట్ రుచులపై మనసు పారేసుకుంది. కడుపు నిండా తినకపోతే ఎందుకీ జీవితం అంటుంది ఈ ముద్దుగుమ్మ.
రాశిఖన్నా
రాశీఖన్నాకు గతంలో ఏ హాబీ ఉండేదో తెలియదు కానీ, ఏడాదిన్నరగా మాత్రం ఆమె హాబీ గిటార్. మొదటి లాక్ డౌన్ లో గిటార్ నేర్చుకుంది రాశిఖన్నా. అప్పట్నుంచి దాన్ని తన వెంటే తీసుకెళ్తోంది. సమయం దొరికినప్పుడల్లా గిటార్ ప్లే చేస్తూ మంచి పాట పాడుతుంటుంది.