సినిమాల్లో నటించి ఆ వచ్చే రెమ్యూనరేషన్ తోనే హీరోయిన్లు నెట్టుకొస్తారనుకుంటే చాలా పొరపాటు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు అదనపు సంపాదన మార్గాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు షాప్ ఓపెనింగ్స్ తీసుకుంటే.. ఇలాంటి రిబ్బన్ కంటింగ్ వ్యవహారాలు, హీరోల కంటే హీరోయిన్లకే ఎక్కువ. వాళ్లు డబ్బులు తీసుకొని కట్ చేస్తారు. ఇప్పుడు వీటికి మించిన అదనపు ఆదాయ వనరు హీరోయిన్లకు దొరికింది. అదే సోషల్ మీడియాలో పోస్టులు.
హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. వైవాహిక బంధం నుంచి తప్పుకున్న తర్వాత ఈమె కెరీర్ పై మరింత తీవ్రంగా దృష్టిపెట్టింది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా అంగీకరిస్తోంది. వీటితో పాటు ఇనస్టాగ్రామ్ లో పెట్టే పోస్టులతో బాగా సంపాదిస్తోంది సమంత. ఒకప్పుడు ఇనస్టాగ్రామ్ లో ఓ పెయిడ్ పోస్ట్ పెట్టేందుకు 8 లక్షలు తీసుకునే ఈ బ్యూటీ, ఇప్పుడు 15-20 లక్షలు డిమాండ్ చేస్తోంది.
కాజల్ అయితే ఎప్పుడో ఈ మార్క్ దాటిపోయింది. ఇనస్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు కనీసం 25 లక్షల రూపాయలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, తను నటించిన యాడ్స్ ను తన ఎకౌంట్ లో పెట్టడానికి కూడా ఈమె ఛార్జ్ చేస్తుంది.
స్టార్ స్టేటస్ ఉండి కూడా, ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉన్న హీరోయిన్ పూజాహెగ్డే. ఇనస్టాగ్రామ్ లో ఓ పెయిడ్ పోస్ట్ పెట్టడానికి ఈమె 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటోంది. అయితే ఇందులో కూడా ఆమె తేడాలు చూపిస్తుంది. డైరక్ట్ గా పోస్ట్ గా చెప్పడానికి ఓ రేటు, రీల్స్ లో పెట్టడానికి మరో రేటు ఛార్జ్ చేస్తుంది.
తమన్న, రష్మిక దాదాపు ఒకే రేటులో ఉన్నారు. ఓ యాడ్ పోస్ట్ చేయడానికి వీళ్లిద్దరూ అటుఇటుగా 12 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే వీళ్లు ఏది పడితే అది పెట్టడం లేదు. తాము నటించే యాడ్స్, లేదా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బ్రాండ్స్ కు సంబంధించి మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇలా హీరోయిన్లంతా తమ సోషల్ మీడియా ఎకౌంట్లతో బాగానే సంపాదిస్తున్నారు.