టీ 20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రాన్ హిట్‌మేయర్ దూరమయ్యారు. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన విమానాన్ని ఆయన మిస్ చేసుకున్నారు. దీంతో టీ 20లో విండీస్ జట్టు నుంచి ఆయన ఔట్ అయ్యారు. ఆయన స్థానంలో షామ్రా బ్రూక్స్ జట్టులో ఆడుతారని ఐసీసీకి కరేబియన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన విమానాన్ని హిట్ మేయర్ కోసం విండీస్ క్రికెట్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. కానీ కుటుంబ కారణాల వల్ల ఆయన ఈ నెల 1న విమానాన్ని అందుకోలేకపోయారు.
ఈ క్రమంలో ఆయనకు విండీస్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 3న మరో విమానంలో హిట్ మేయర్ కోసం విండీస్ బోర్డు సీట్ బుక్ చేసింది. కానీ సోమవారం కూడా హిట్ మేయర్ సరైన సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేపోయాడని వెస్టిండీస్ బోర్డు తెలిపింది.
ఈ కారణంగా అతన్ని తుది జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెస్టిండీస్ బోర్డు వెల్లడించింది. ఆస్ట్రేలియాతో తొలి టీ 20 మ్యాచ్ బుధవారం జరగాల్సి వుంది. వరల్డ్‌కప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ను స్కాట్‌లాండ్‌తో విండీస్ ఈ నెల 17 ఆడాల్సి వుంది.