గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో చెరువులన్నీ పొంగి హైదరాబాద్ లో పలు కాలనీలను ముంచెత్తాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లే మార్గంలో ఉన్న అప్పా చెరువు గగన్ పహడ్ వద్ద పొంగిపొర్లుతుండటంతో ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునే వారు ఔటర్ రింగ్ రోడ్డునే ఉపయోగించాలని పోలీసులు హైదరాబాద్ వాసులను కోరారు. బెంగళూరు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డా.. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు.
భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండిపోవటంతో మూసీలోకి వరద ఎక్కువగా వస్తుంది. ఇటు ట్యాంక్ బండ్ కూడా పూర్తిగా నిండటంతో కిందకు నీరు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పోటెత్తే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా జనం పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో మంగళ, బుధవారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది.