దక్షిణ అండమాన్ లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా , సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది. ఈ రోజు సాయంత్రానికి తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా
రాబోతుంది.
ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ.. ఈ నెల 9 వ తేదీ రాత్రి లేదా 10న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడులో చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని ఐఎండీ చెబుతోంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ నుంచి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దం అవుతోంది.
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం కారైకాల్ కు తూర్పు ఆగ్నేయంగా 970 కిమీ, చెన్నై కి 1020 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రానున్న 48 గంటలు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరాలకు ఆనుకొని
కొనసాగుతుందన్నారు.
దీంతో ఏపిలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని…ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని ఆదేశాలను జారీ చేసింది. అదే విధంగా అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 1070,18004250101,08632377118
సంప్రదించాలని సూచించింది.