వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎల్లంపల్లి నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా.. 19.75 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా వరద చేరుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మించాక ఇంత వరద రావడం ఇదే మొదటిసారి.
ములుగు జిల్లా రామన్న గూడెం పుష్కర ఘాట్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత నీటి మట్టం 17.460 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యం గల కడెం ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల వరద వెల్లువలా వచ్చి చేరింది. నీటిని దిగువకు వదిలారు అధికారులు.
పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిఖని, మంచిర్యాల దారిలోని బ్రిడ్జి పై వరద చేరింది. గోదావరిఖని గంగానగర్ దగ్గర ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. మంచిర్యాల, గోదావరిఖని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగానగర్ లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి.. బస్టాండ్ సమీపంలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు అధికారులు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటలకు 59.90 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వరస్వామి ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఆలయంలో 20 మంది చిక్కుకుపోయారు. వరద అంతకంతకూ పెరుగుతుండడంతో భయాందోళనలో ఉన్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాధితులు వేడుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో కేంద్రంలో లోతట్టు ప్రాంత కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో కలిసే రాళ్లవాగు బ్యాక్ వాటర్.. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి చేరడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. రామ్ నగర్, ఎల్ఐసి కాలనీ, బాలాజీ నగర్, పద్మశాలి కాలనీ, ఎన్టీఆర్ నగర్, బైపాస్ రోడ్డు, లక్ష్మీ నగర్, ఆదిత్య ఇంక్లైన్ పాత మంచిర్యాల సరిహద్దులోని నివాస గృహాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికోసం పోలీస్ శాఖ గుర్రాలను వినియోగిస్తోంది.